అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన కోసం ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జనగణనలో భాగంగా మొదటి విడత ఇళ్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనుండగా.. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్ లకు వెళ్లి ఇళ్లను లెక్కించనున్నారు. నెలరోజులపా టు కొనసాగనున్న ఈ ప్రక్రియ ఆధారంగా 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు ప్రకటించనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సెల్ప్ ఎన్యుమరేషన్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించగా.. జిల్లాలో 4,636 మంది తమ వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ప్రజలకు స్వీయ గణనపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు దీనిని వినియోగించుకోలేదని తెలుస్తోంది.
రెండు దశల్లో ప్రక్రియ..
జనగణన–2027 కోసం జిల్లా యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. మొదట ఇళ్ల లెక్కింపు, తర్వాత జనాభా లెక్కింపు చేపట్టనున్నారు. రెండు దశల్లో జరగనున్న జనగణన కోసం ఇప్పటికే 1,567 ఎన్యుమరేటర్లు, 274 మంది సూపర్‌వైజర్లకు శిక్షణ పూర్తయ్యింది. వీరు సోమవారం నుంచి జూన్ 9 వరకు వారికి కేటాయించిన ప్రదేశాల్లో స్వీయ గణన చేసుకొని గృహాల గుర్తింపు చేయనున్నారు. మొదట ఎన్యుమరేటర్లు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్‌ఎల్‌ఓ), కుటుంబాల వివరాలను 30 రోజుల్లో సేకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి 150 నుంచి 200 నివాసాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున నియమించారు. ఇప్పటికే బీఎల్‌ఓలు బ్లాకులుగా విభజించి మ్యాపింగ్ తయారు చేశారు. ఇళ్లు, కట్టడాలతోపాటు సౌకర్యాల వివరాలను నమోదు చేయనున్నారు.
● రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. జననాలను మార్చి ఒకటి నుంచి కటాఫ్‌గా తీసుకుని నమోదు చేయనున్నారు. 34 అంశాలతో కూడిన ప్రశ్నావళిని ఎన్యుమరేటర్లు జిల్లాలో ప్రతి ఇంటి నుంచి వివరాలు తీసుకోనున్నారు. ఇంటి రకం నుంచి మొదలు సౌకర్యాలు, సామాజిక స్థితి ప్రతిబింబించేలా పలు ప్రశ్నలతో కూడిన అంశాలను అడిగి నమోదు చేస్తారు.
2011 లెక్కల ఆధారంగా..
ఉమ్మడి రాష్ట్రంలో 2011లో చేపట్టిన జనాభా లెక్కలే ఇప్పటికీ జిల్లా జనాభాకు ప్రామాణికంగా మారాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతోనూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ– రాజకీయ కుల సర్వే (ఎస్‌ఈఈఈపీసీ– 2024) చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశాభివృద్ధి, లోటుపాట్లపై ప్రణాళికలు రూపొందించాలంటే జనాభా స్పష్టత ఉండాలి. అలాగే ఆయా వర్గాల్లో అర్హులకు ప్రయోజనాలు దక్కాలన్నా ఈ జనాభా వివరాలే కీలకం కానుంది.
జిల్లా విస్తీర్ణం 7,447.42
చ.కి.మీ.,
మండలాలు 20
గ్రామ పంచాయతీలు 461
రెవెన్యూ గ్రామాలు 339
మున్సిపాలిటీలు 4
జనాభా 8,61,766
నివాస గృహాలు 1,96,261
సాగుదారులు 1,49,066
వ్యవసాయ కూలీలు 1,55,713
మొత్తం బ్లాక్‌లు 1,724
ఎన్యుమరేటర్లు 1,567
సూపర్‌వైజర్లు 274
టోల్ ఫ్రీ నంబరు 1855
నేటినుంచి సమగ్ర
జనాభా లెక్కల నమోదు
ముగిసిన సెల్ప్ ఎన్యుమరేషన్.. 4,636 మంది నమోదు
జిల్లాలో హౌస్‌లిస్టింగ్ సెన్సస్‌కు
సర్వం సిద్ధం
జిల్లా వివరాలు ఇలా..


