జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో తాగునీటికి కటకట
● మున్సిపాలిటీ శివారు కాలనీలకు పక్షం రోజులకోసారి సరఫరా
● నల్లా కనెక్షన్ ఉన్నా..
అందని మిషన్ భగీరథ నీరు
● పైప్‌లైన్ లీకేజీలను సైతం
అరికట్టని వైనం
● వేసవిలోనూ కనిపించని ప్రత్యామ్నాయ చర్యలు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో తాగునీటికి కటకట ఏర్పడుతోంది. వేసవికి ముందే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాకేంద్రంతోపాటు అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలు మరమ్మతుకు నోచుకోవడం లేదు. వేసవిలో పలుచోట్ల ప్రైవేటు బోర్లు అడుగంటడం, మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో తాగడానికి, ఇతర అవసరాలకు నీరు సరిపోక జనం ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాకేంద్రంలో వారానికోసారి నీరు..
వేసవిలో నీటి ఎద్దడి కారణంగా జిల్లాకేంద్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం, సగానికి మించి కాలనీల్లో సరఫరా సవ్యంగా సాగడం లేదు. ప్రధానంగా దత్తాత్రేయకాలనీ, బీసీ కాలనీ, శ్రీపురం రోడ్డు, హౌసింగ్‌బోర్డు కాలనీ, ఈశ్వర్ కాలనీల్లో భగీరథ నీరు రావడం లేదు. మిగతా చోట్ల వారం రోజులకు ఒకసారి, శివారు కాలనీలకు పక్షంరోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు.
మరమ్మతు కరువు..
జిల్లాకేంద్రంతోపాటు మిగతా మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుకు నోచుకోవడం లేదు. రోజుల తరబడి తాగునీరు వృథాగా పారుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. గతంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ, మరమ్మతు సంబంధిత అధికారులే నిర్వర్తించేవారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో మరమ్మతు చేపట్టాలంటే అధికారులు టెండర్లు నిర్వహించి పనులు చేపట్టాల్సి వస్తుండటంతో ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఎగువ ప్రాంతాలకు నీటి సరఫరా అందడం లేదు.


