లాభాల పంట..! | - | Sakshi
Sakshi News home page

లాభాల పంట..!

May 9 2026 9:31 AM | Updated on May 9 2026 9:31 AM

రైతుల్లో ఆసక్తి పెరిగింది..

8వేలకు పైగా ఎకరాల్లో..

జిల్లాలో పెరుగుతున్న ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం

రైతుల అనుమానాలకు తెర

గెలల అమ్మకానికి నియోజకవర్గ

కేంద్రాల్లోనే కొనుగోలు కేంద్రాలు

టన్నుకు రూ.23వేలకు పైగా ధర

సాగుపై మరింత ఆసక్తి చూపుతున్న రైతులు

–8లో u

మొదట్లో ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు పెద్దగా ఇష్టం చూపలేదు. ఇప్పుడు వారిలో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు కారణం ఆయిల్‌పామ్‌ ధరలు స్థిరంగా ఉండటమే. చాలామంది రైతుల తోటల్లో పంట దిగుబడి ప్రారంభమైంది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లిలో కొనుగోలు కేంద్రం ఉంది. రైతులు అక్కడికి పంటను తీసుకొచ్చి మద్దతు ధర ప్రకారం అమ్ముకుంటున్నారు. ఇందులో దళారీ వ్యవస్థ లేదు. రైతుల అకౌంట్‌లో నేరుగా డబ్బులు జమ అవుతాయి. కొనుగోలు కేంద్రాన్ని మేమే పర్యవేక్షిస్తున్నాం.

– లక్ష్మణ్‌,

ఉద్యానశాఖ డివిజన్‌ అధికారి, కొల్లాపూర్‌

కొల్లాపూర్‌: ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు లాభదాయకంగా మారుతోంది. పంటసాగు ప్రారంభించిన తొలినాళ్లలో ఆయిల్‌పామ్‌ దిగుబడి, కొనుగోలు అంశాలపై రైతులు కొంత కలవరపడ్డారు. అధికారులు చెప్పినట్లుగా లబ్ధి చేకూరుతుందో లేదోననే అనుమానాలు ఉండేవి. అయితే ఇప్పుడు వారి అనుమానాలకు తెరదించుతూ ఆయిల్‌పామ్‌ పంట లాభాలు తెచ్చిపెడుతోంది. సాగుపై రైతుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. పంట దిగుబడి వచ్చాక విక్రయాలకు కూడా ఇబ్బందులు లేకపోవడమే ఇందుకు కారణం.

ప్రారంభమైన దిగుబడులు..

ఆయిల్‌పామ్‌ సాగు ప్రారంభంలో కేవలం 58 మంది రైతులు మాత్రమే ముందుకొచ్చారు. తొలి ఏడాది 221 ఎకరాల్లో పంటసాగు చేపట్టారు. నాలుగేళ్ల తర్వాత ఆయిల్‌పామ్‌ దిగుబడి ప్రారంభమైంది. పదేళ్లలోపు వయసు గల ఆయిల్‌పామ్‌ చెట్ల నుంచి ప్రతి సంవత్సరం 6 టన్నుల వరకు పంట వస్తుంది. ఆ తర్వాత ఏడాదికి 10 టన్నుల వరకు పంట చేతికందుతుంది. ఏడాదంతా పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. నెలకోమారు గెలలు కత్తిరించాలి. డిమాండ్‌ ప్రకారం కొనుగోలు ధరల్లో కొంతమేరకు హెచ్చుతగ్గులు ఉంటాయి.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..

గతేడాది వరకు జిల్లా కేంద్రంలో మాత్రమే ఆయిల్‌పామ్‌ గెలల కొనుగోలు జరిగేది. ఈ ఏడాది నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్‌ గెలల ధర రూ. 23వేలకు పైగా పలుకుతోంది. నాలుగేళ్ల క్రితం టన్ను ధర రూ. 12వేల వరకు స్థిరంగా ఉండేది. క్రమంగా ఆయిల్‌పామ్‌ పంటకు మద్దతు ధర పెరుగుతూ వస్తోంది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఉద్యానశాఖ అధికారులే పర్యవేక్షిస్తున్నారు.

జిల్లాలో 2019–20 సంవత్సరం ఆయిల్‌పామ్‌ సాగుకు శ్రీకారం చుట్టారు. పంటసాగు కోసం ప్రభుత్వం రాయితీలు అందించింది. నాలుగేళ్లు పైలెట్‌ ప్రాజెక్టుగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా సాగుకు సంబంధించిన రాయితీలు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,158 మంది రైతులు 8,119 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement