● ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా పాల్గొనాలి
● అదనపు కలెక్టర్ అమరేందర్
నాగర్‌కర్నూల్ క్రైం: జనగణనపై ఎలాంటి అపోహ అవసరంలేదని.. ప్రతి కుటుంబం తమ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేయించుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అమరేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ముఖ్య ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన దేశాభివృద్ధికి పునాది వంటిదన్నారు. ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జనగణనతో ప్రజల జీవన పరిస్థితులు, విద్య, ఉపాధి, గృహ వసతులు, సామాజిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ గణాంకాల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేస్తాయని చెప్పారు. జనగణన ద్వారా సేకరించిన సమాచారం పూర్తి గోప్యంగా ఉంచబడుతుందని.. కేవలం ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పన కోసమే ఉపయోగించబడుతుందని ఆయన స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి.. జనగణన విజయవంతానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిణి సుజాత, డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్, డీఈఓ రమేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
తలసేమియా రహిత సమాజాన్ని నిర్మిద్దాం
తలసేమియా రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ కోరారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశా మైదానం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం రక్త పరీక్ష ద్వారా తలసేమియాను గుర్తించవచ్చని తెలిపారు. వ్యాధి తీవ్రత మేరకు కొందరికి తరచుగా రక్తమార్పిడి అవసరం కూడా ఏర్పడుతుందన్నారు. తలసేమియా బాధితులు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవికుమార్, ప్రోగ్రాం అధికారి డా.కృష్ణమోహన్, డా.ప్రదీప్‌కుమార్, వైద్యాధికారి డా.వాణి, డా.సృజన పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీకి పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 18 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,830 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,727 మంది పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, గాలి, వెలుతురు స్పష్టంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, డీఈఓ రమేశ్‌కుమార్ ఉన్నారు.


