కల్వకుర్తి రూరల్: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటికే మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభించామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. తమది రైతు ప్రభుత్వమని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధ ం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ యాదవ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ షానవాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసుల రమాకాంత్‌రెడ్డి, కౌన్సిలర్ రాజు పాల్గొన్నారు.
పశుపోషణతో
అదనపు ఆదాయం
నారాయణపేట: పశుపోషణతో సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆదాయంతో పాటు జీవనోపాధి లభిస్తుందని తెలంగాణ పశుసంవర్ధకశాఖ అదనపు సంచాలకుడు డా. బి.సుబ్బారాయుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని పశువైద్యశాల, జిల్లా పశుసంవర్ధక అధికారి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు, పశు సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు దూడల సంరక్షణలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస సాగుపై రైతులు దృష్టి సారించాలని, వేసవిలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ కుటుంబ పోషణకు పాడి పరిశ్రమను కొనసాగించడం ఆదర్శనీయమని గుర్తుచేస్తూ అభినందించారు. జిల్లా పశు వైద్యాధికారి డా. బి.ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో చాలామంది గొర్రెల పెంపకం చేపడుతూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పాడిపశువుల పెంపకంపై ఆసక్తి కనబర్చాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం జిల్లాకేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. పాడి రైతులు, మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి, పుర చైర్‌పర్సన్ కొండ శ్వేత, వైస్ చైర్‌పర్సన్ మంజుల, కౌన్సిలర్ సత్యమ్మ, బీకేఎస్ నాయకులు వెంకోబ, విశ్వనాథ్‌రెడ్డి, అనంతరెడ్డి, పశు వైద్యాధికారులు డా. బి.వెంకటేశ్వర్లు, డా. అనిరుధ్ ఆచార్య, డా. రాఘవేందర్‌గౌడ్, డా. రోహిత, డా. శ్రీనివాస్, సిబ్బంది గోపాలమిత్రులు పాల్గొన్నారు.


