పూర్వ కలెక్టర్‌ సంతోష్‌కు ఆత్మీయ వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

పూర్వ కలెక్టర్‌ సంతోష్‌కు ఆత్మీయ వీడ్కోలు

May 9 2026 9:31 AM | Updated on May 9 2026 9:31 AM

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లపాటు సేవలందించి.. ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా బదిలీ అయిన బదావత్‌ సంతోష్‌కు శుక్రవారం వివిధ శాఖల అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఆయనను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. కలెక్టర్‌గా ఆయన పరిపాలనా దక్షత, ప్రజలపై చూపిన సేవాభావం, విద్య, వైద్యరంగాల అభివృద్ధికి చేసిన కృషిని పలువురు ప్రశంసించారు. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎస్పీ డా.సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. అనంతరం బదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పనిచేసిన కాలం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడంలో అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేశారని.. అందరి కృషితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. విద్య, వైద్యంపై అధికారుల చిత్తశుద్ధితోనే పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానానికి రావడం జరిగిందన్నారు. వైద్యసేవలను గ్రామీణ స్థాయిలో విస్తరించినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతు సంక్షేమం, విద్య, వైద్యం, తాగునీరు వంటి అంశాల్లో జిల్లా ముందంజలో నిలవడానికి ప్రతి శాఖ కృషి చేసిందన్నారు. జిల్లా ప్రజలు తనపై చూపిన ఆదరణ, ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవసహాయం, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement