చిన్నంబావి: మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలకేంద్రంలో మొక్కజొన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షానికి పంట తడిసిందని.. గన్నీ బ్యాగుల కొరత ఉండటంతో బహిరంగ మార్కెట్లో రూ.40 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు రైతులు వివరించారు. వెంటనే ఆయన కలెక్టర్‌కు ఫోన్‌చేసి పరిస్థితి వివరించారు. తడిసిన పంటను సైతం కొనుగోలు చేయాలని, గన్నీ బ్యాగుల సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పాలనలో మొక్కజొన్న, పప్పుశనగలు, వరి ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని.. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా రైతు ప్రశాంతంగా ఉన్నది లేదని విమర్శించారు. మంత్రి జూపల్లి సొంత మండలంలోనే ఈ పరిస్థితి ఉందంటే.. జిల్లాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిన్నంబావిలో పుప్పుశనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టకపోవడంలో ఆంతర్యమేమిటో మంత్రి రైతులకు వివరించాలని కోరారు. ఆయన వెంట చెల్లపాడు సర్పంచ్ పెద్దనర్సింహ, రంజిత్‌కుమార్, మహేశ్వర్‌రెడ్డి, డేగ శేఖర్, రామకృష్ణ, సంపంగి మద్దిలేటి, తగరం నర్సింహ, సుధాకర్, జేవీకే నాయుడు, మహిచంద్ర, బాలగౌడు తదితరులు ఉన్నారు.


