● ఉన్న రేటు కంటే మూడింతలు అధికంగా వసూళ్లు
● ఇదేమిటని అడిగితే బెదిరింపులు
● పట్టించుకోని మున్సిపల్ అధికారులు
కందనూలు: జిల్లాకేంద్రంలో మామిడి వ్యాపారులు, రైతుల వద్ద కొందరు తైబజారు పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వ్యాపారులు, రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులను తైబజార్ పేరుతో దోపిడీ చేస్తున్నారని.. ఒక్కో గంప, ట్రేకు మున్సిపాలిటీ నిర్ణయించిన రేటు రూ.28 కాగా.. నిబంధనలు ఉల్లంఘించి ఒక్కొక్క గంప, ట్రేకు రూ.100 వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఉన్న రేటు కంటే మూడింతలు అధికంగా వసూలు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించగా రేపటి నుంచి మీరు ఇక్కడ అమ్మడానికి వీలు లేదని బెదిరిస్తున్నారని, తీసుకున్న రుసుంకు రసీదు అడిగితే ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారని ఎందుకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని అడిగితే మున్సిపాలిటీ వాళ్లకు మేం కూడా ఎక్కువగా చెల్లిస్తున్నాం.. కాబట్టి మీరు కూడా అడిగినంత ఇవ్వాలని దబాయిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సరైన ధరలు లేక తీసుకొచ్చిన సరుకు ఆటోల కిరాయి, ఇతర ఖర్చులు ఎక్కువై ఇబ్బందులు పడుతున్నామని, తైబజారు పేరుతో రసీదు లేకుండా అక్రమ వసూళ్లు చేయడం ఎంతవరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజలకు, పండ్లు వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.


