కందనూలు: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామ, వార్డుసభల నిర్వహణపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 461 జీపీల్లో గ్రామసభలు, 4 మున్సిపాలిటీల్లో వార్డుసభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల తో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యు లు, యువత, రైతులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వివిధ పథకాల లబ్ధిదారులు సభలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం సంబంధిత అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. గ్రా మ, వార్డు సభల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లతో పాటు ఓఆర్‌ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, అమరేందర్, జెడ్పీ సీఈఓ దేవసహాయం ఉన్నారు.
సలేశ్వరం జాతరకు
పటిష్ట బందోబస్తు : ఎస్పీ
అచ్చంపేట రూరల్: సలేశ్వరం జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ తెలిపారు. మంగళవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సలేశ్వరం జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా 326 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే సలేశ్వరం సందర్శన సమయం కేటాయించిన విషయాన్ని భక్తులు గమనించాలన్నారు. వేసవి దృష్ట్యా భక్తులందరూ తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు ఉన్నారు.
పంటమార్పిడితో
అధిక దిగుబడులు
బిజినేపల్లి: పంటమార్పిడి విధానంతో తెగుళ్లకు కళ్లెం వేయడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎల్.కృష్ణ అన్నారు. మంగళవారం పాలెం కేవీకేలో రైతులకు పంటల మార్పిడి, వైవిధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ మాట్లాడుతూ.. రైతులు వానా కాలంలో ఒక పంటను సాగుచేస్తే.. యాసంగి లో మరో పంటను పండించాలన్నారు. తద్వా రా పంటలోని చీడపీడల అవశేషాలు మరో పంటపై ప్రభావం చూపవని వివరించారు. దీంతో సహజంగానే తెగుళ్ల బెడద తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతుందని తెలిపారు. పంట మార్పిడి సమయంలో అందుకు అనుగుణంగా దుక్కి దున్ని విత్తుకోవాలన్నారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు పాత పంట అవశేషాలు ప్రభావం చూపని మరో పంటను సాగుచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి, శాస్త్రవేత్తలు శశిభూషణ్, శ్రీధర్, సహజ వ్యవసాయ రైతు లావణ్య రమణారెడ్డి పాల్గొన్నారు.


