‘పది’ మూల్యాంకనానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘పది’ మూల్యాంకనానికి సిద్ధం

Apr 1 2026 7:30 AM | Updated on Apr 1 2026 7:30 AM

కందనూలు: పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు విధులను కేటాయించి.. ఉత్తర్వులు జారీ చేశారు. మూల్యాంకనం మూడు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత బుధవారం నుంచి 9వ తేదీ వరకు తెలుగు, హిందీ, ఆంగ్లం, రెండవ విడత 10 నుంచి 17వ తేదీ వరకు భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, మూడవ విడత 18 నుంచి 23వ తేదీ వరకు సాంఘీకశాస్త్రం పరీక్షల మూల్యాంకనం నిర్వహించనున్నారు.

806 మందికి విధులు..

జిల్లాకు 1.72,190 జవాబుపత్రాలను మూల్యాంకనానికి కేటాయించారు. ఇందులో తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితంతో కలిపి ప్రస్తుతం 88వేల పేపర్లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. మిగతా పరీక్షలు పూర్తయిన తర్వాత పూర్తి జవాబుపత్రాలు వచ్చే అవకాశం ఉందని పరీక్షల విభాగం అధికారి రాజశేఖర్‌రావు వెల్లడించారు. కాగా, జవాబుపత్రాల మూల్యాంకనానికి మొత్తం 806 మందికి విధులు కేటాయించారు. వీరిలో ఏఈలు 552 మంది, సీఈలు 92 మంది, స్పెషల్‌ అసిస్టెంట్లు 162 మంది ఉన్నారు.

ఉదయం 9 గంటలకు రిపోర్టు..

జిల్లా కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన వాల్యుయేషన్‌ కేంద్రంలో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం వాల్యుయేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు అంశాలను అధికారులు వారికి తెలియజేస్తారు. వాల్యుయేషన్‌ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు 40 పేపర్లు వాల్యుయేషన్‌ చేయాల్సి ఉంటుంది.

కేంద్రంలో సౌకర్యాల కల్పన..

మూల్యాంకన కేంద్రంలోని స్ట్రాంగ్‌రూం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. మూల్యాంకనం నిర్వహించే గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు తాగునీటి వసతి, లైట్లు, ఫ్యాన్లు, ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. ప్రథమ చికిత్స కోసం ఏఎన్‌ఎం, ఇతర సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచనున్నారు.

నేటి నుంచి 23 వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌

జిల్లాకు 1.72లక్షల జవాబు పత్రాలు కేటాయింపు

జిల్లాకేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement