కందనూలు: జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పుర చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి.. పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీలో మొత్తం 11వేల నివాసగృహాలు ఉండగా.. ఇప్పటివరకు 57శాతం పన్నులు వసూలైనట్లు తెలిపారు. మొత్తం రూ. 7 కోట్లకు గాను రూ. 4 కోట్ల ఇంటిపన్ను బకాయిలు వసూలు చేశామని.. ఈ నెల 31వ తేదీలోగా ఇంటి పన్ను బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ బాదం రమేశ్, కమిషనర్ నాగిరెడ్డి ఉన్నారు.


