జిల్లాలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు
బాలికలకూ అబార్షన్లు..
జిల్లాలోని ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులతో పాటు ఆర్‌ఎంపీ, పీఎంపీలు సైతం ఆబర్షన్లు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తమను ఆశ్రయిస్తున్న మైనర్ బాలికలకు గుట్టుచప్పుడు కాకుండా ఆబర్షన్లు నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రసూతి ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో కార్యకలాపాలపై నిఘా ఉంచడంతో పాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు.. పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే తప్ప స్పందించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పర్యవేక్షణ కరువు..
జిల్లావ్యాప్తంగా 38 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. గర్భంలో ఉన్న శిశువు కదలికలు, ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు స్కానింగ్ నిర్వహిస్తుంటారు. టీఫా స్కాన్ తదితర స్కానింగ్‌లకు రూ. 2 వేల నుంచి రూ. 3వేల వరకు తీసుకుంటున్నారు. అయితే కొన్ని సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు చేపడుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్ చట్టం – 2010 కింద ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, నర్సింగ్‌హోంల నిర్వహణ, కార్యకలాపాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఈ విషయంలో సంబంధిత అధికారులు ఉదాసీనంగా ఉన్నట్టుగా విమర్శలున్నాయి.
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని పలు స్కానింగ్ కేంద్రాలు, ప్రసూతి ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలతో పాటు గర్భస్త్రావ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గుట్టుగా నిర్ధారణ పరీక్ష చేసి.. ఆడ, మగ చెప్పేందుకు రూ. 10 వేల నుంచి రూ. 20వేల వరకు వసూలు చేస్తున్నారు. శిశువు వద్దనుకుంటే నిబంధనలేవీ పట్టించుకోకుండా అబార్షన్లు సైతం నిర్వహిస్తున్నారు. ఇందుకు కనీసం రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లోని ఆస్పత్రుల్లో ఈ దందా ఎక్కువగా సాగుతున్నట్టు తెలుస్తోంది.
నిబంధనలు గాలికి..
లింగనిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలుచేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు డయాగ్నొస్టిక్, స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ జిల్లాలోని పలుచోట్ల ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడుతూ బరితెగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై నిఘా ఉంచి, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొల్లాపూర్ పట్టణంలోని సాయికృప ఆస్పత్రిలో ఈ నెల 11న వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గర్భస్త్రావం చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రిలోని డాక్టర్, నర్సుతో పాటు మరో ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ.. అందిన కాడికి దండుకుంటున్నాయనడానికి ఈ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు.
స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో గర్భస్త్రావ ఆపరేషన్లు
కఠిన నిబంధనలు ఉన్నా జంకని వైనం
ఇటీవల కొల్లాపూర్‌లో ఓ ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు


