● కేజీబీవీల్లో బోధన, బోధనేతర సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి
● ఆర్జేడీ సోమిరెడ్డి
తిమ్మాజిపేట: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధి కేంద్రాలుగా నిలిచాయని.. ఈ సంస్థలో పనిచేస్తున్న ఆధ్యాపకులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించమని ఆర్జేడీ ఎం.సోమిరెడ్డి అన్నారు. తిమ్మాజిపేట కేజీబీవీలో ఇటీవల ప్రత్యేకాధికారి, వర్కర్ల మధ్య తలెత్తిన విభేదాలు, తదుపరి పరిణామాలపై బుధవారం ఆయన సమగ్ర విచారణ చేపట్టారు. ముందుగా తరగతి గదుల్లో విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలతో పాటు బోధనా విధానం, ఉపాధ్యాయుల పనితీరు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆర్‌జేడీ మాట్లాడుతూ.. కేజీబీవీల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ వృత్తిపై నిబద్ధతతో వ్యహరిస్తూ.. విద్యార్థినులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థినులకు మెరుగైన విద్యతతో పాటు పోషకాలతో కూడిన ఆహారం అందించడంలో అలసత్వం వహించొద్దన్నారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఓ సుజాతను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత, విద్యాభివృద్ధిపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆర్‌జేడీ వెంట జీసీడీ శోభారాణి ఉన్నారు.


