నేడు తెలుగువారి పండుగ
● శ్రీపరాభ వ నామ సంవత్సరానికి స్వాగతం
● ఆలయాల్లో పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు
● సాగు పనులకు శ్రీకారం
చుట్టనున్న అన్నదాతలు
అచ్చంపేట/కందనూలు: తెలుగువారి తొలి పండుగ ఉగాదిని గురువారం ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పండుగ రోజున సంప్రదాయబద్ధంగా ఆలయాలను సందర్శించి.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జీవితంలో అన్ని అనుభూతులను షడ్రుచుల్లా ఆస్వాదించాలనే అంతరార్థంతో పచ్చడిని స్వీకరిస్తారు. సాయంత్రం వేళ వేద పడింతులు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంశాలను ప్రస్తావిస్తూ.. పంచాంగ పఠనం చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కులవృత్తుల వారు తమ పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాగా, ఉగాది పచ్చడికి అవసరమైన మట్టికుండలు, మామిడికాయలు, బెల్లం, వేపపూత, కొత్త చింతపండు, మామిడి తోరణాల విక్రయాలతో మార్కెట్లు రద్దీగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా, బస్టాండ్ కూడలి, కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్, నల్లవెల్లి రోడ్డు కొనుగోలుదారులతో సందడిగా మారాయి.


