
సీజనల్ వ్యాధులతో బెంబేలు
వర్షాల కారణంగా జిల్లాలో పెరుగుతున్న విష జ్వరాలు
ప్రభుత్వ లెక్కల్లో కొన్ని.. ప్రైవేటులో చాలా..
●
నాగర్‌కర్నూల్ క్రైం: రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో సీజనల్ వ్యాధులతో పాటు విషజ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో వర్షాలతో తాగునీరు కలుషితమవుతుంది. వాటిని తాగిన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా మారుతుండటంతో దోమల వ్యాప్తి పెరిగి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా వ్యాధులు రోజురోజుకూ పెరిగిపోయి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల గ్రామంలో ఆరేళ్ల చిన్నారి టైఫాయిడ్ బారిన పడి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆర్‌ఎంపీల చేతివాటం
జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చాలామంది జ్వరాల బారిన పడుతుండటంతో గ్రామాల్లో ప్రజలు ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వారు వచ్చిరాని వైద్యంతో అవసరం లేని టెస్టులతో పాటు యాంటిబయాటిక్స్ మందులను రోగులకు ఇస్తు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌ఎంపీలకు జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్, స్కానింగ్ సెంటర్లలో కమీషన్లు ముట్టజెబుతుండటంతో చాలా మంది రోగులను రెఫర్ చేస్తున్నారు. గతంలో జిల్లాలో ఆర్‌ఎంపీల వైద్యం వికటించి పలువురు రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఆర్‌ఎంపీలను కట్టడి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను పలువురు కోరుతున్నారు.
రోగులతో కిటకిటలాడుతున్న
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు
స్థాయికి మించి
వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మార్చిలో 1, జూలైలో 9, ఆగస్టులో 26 డెంగీ కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్, చికెన్‌గున్యా, మలేరియా కేసులు నమోదుకానట్లు వెల్లడిస్తున్నారు. కాగా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో నమోదవుతున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్‌గున్యా కేసులు వందల సంఖ్యల్లో ఉన్నప్పటికీ జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించకపోవడం గమనార్హం. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ధనార్జనే ధ్యేయంగా అవసరం లేకపోయినప్పటికీ విషజ్వరాల పేరిట యాంటిబయాటిక్స్‌తో వైద్యం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లతో పాటు స్కానింగ్ సెంటర్లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సీజనల్ వ్యాధులతో బెంబేలు