
ప్రొ.జయశంకర్ ఆశయ సాధనకు కృషి
నాగర్‌కర్నూల్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధననే శ్వాసగా భావించి చివరి వరకు పోరాడిన వీరుడు జయశంకర్ అని కొనియాడారు. కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ మేధావులు, విద్యావంతులు, యువత, ప్రజలతో అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యమ జ్వాలను ప్రగతిపథంలో నిలిపారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఖాజానాజిమ్ అలీ అప్సర్ తదితరులు పాల్గొన్నారు.