
ఫలించిన ఆపరేషన్ ముస్కాన్
నాగర్‌కర్నూల్: వివిధ కారణాలతో చదువులు మానేసి బాలకార్మికులుగా మారిన పిల్లల జీవితాల్లో ఆపరేషన్ ముస్కాన్ వెలుగులు నింపుతోంది. హోటళ్లు, వస్త్ర, కిరాణ దుకాణాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షెడ్లలో పనులు చేస్తున్న బాలకార్మికులను గుర్తించి వారిని వెట్టి నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ అనే కార్యక్రమాలను చేపట్టింది. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను కొనసాగిస్తుంది. మహిళా, శిశు సంక్షేమం, పోలీస్, కార్మిక శాఖ, చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతారు. ఈ క్రమంలోనే గత నెలలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 33 మంది బాలకార్మికులకు వెట్టి నుంచి విముక్తి కలిగించి సదరు పిల్లలను వారి పరిధిలోని పాఠశాలల్లో చేర్పించారు. అలాగే వీరిని పనిలో పెట్టుకున్న 27 మంది యజమానులపై కేసులు నమోదు చేశారు.
ఇప్పటి వరకు 591 మంది..
ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాలు 2014లో ప్రారంభమైనా నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత 2018 జనవరి నుంచి నిర్వహించారు. ఈ క్రమంలో 2018 నుంచి 2025 జూన్ వరకు గడిచిన ఎనిమిదేళ్లలో జిల్లాలో 591 మంది బాలకార్మికులను గుర్తించి వారిని వివిధ పాఠశాలల్లో చేర్పించారు. 2018 జనవరిలో 23, జూలైలో 76, 2019 జనవరిలో 29, జూలైలో 46, 2020 జనవరిలో 104, 2021 జనవరిలో 48 మంది బాలకార్మికులను గుర్తించి వెట్టి నుంచి విముక్తి కల్పించారు. 2020, 2021 జూలైలో కరోనా ప్రభావంతో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహించలేదు. ఆ తర్వాత 2022 జనవరిలో 34, 2022 జూలైలో 23, 2023 జనవరిలో 16, 2023 జూలైలో 18, 2024 జనవరిలో 10, 2024 జూలైలో 23 మంది, 2025 జనవరిలో 108, 2025 జూలైలో 33 మందికి విముక్తి కల్పించారు. 2018 నుంచి బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై అధికారులు లేబర్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేశారు.
మూడు టీంల ఏర్పాటు..
జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కోసం జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించేందుకు మొత్తం మూడు టీంలను ఏర్పాటు చేశారు. అచ్చంపేటకు ఒక టీం, కల్వకుర్తికి ఒక టీం, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌కు కలిపి ఒక టీం ఏర్పాటు చేశారు. మొత్తం నెలరోజులపాటు నిర్వహించిన ఈ తనిఖీల్లో 33 మంది పిల్లలను కాపాడారు. కాగా.. పిల్లలతోని పని చేయిస్తున్న యజమానులపైనే 27 మందిపై కేసులు నమోదు చేయగా మిగతా వారికి జరిమానాలు విధించినట్లు అధికారులు చెబుతున్నారు.
జూలై 1 నుంచి 31 వరకు కొనసాగిన ప్రత్యేక తనిఖీలు
జిల్లాలో 33 మంది బాల కార్మికులకు విముక్తి
27 మంది యజమానులపై కేసులు నమోదు
విముక్తి పొందిన పిల్లలను
పాఠశాలల్లో చేర్పించిన అధికారులు

ఫలించిన ఆపరేషన్ ముస్కాన్