
ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
నాగర్‌కర్నూల్: మున్సిపాలిటీలోని దుకాణ యజమానులు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. పట్టణంలో లైసెన్స్ తీసుకొని దుకాణాలను కమిషనర్ నాగిరెడ్డి మంగళవారం మూసి వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని దుకాణ యజమానులు ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దుకాణాలను మూసి వేస్తామని హెచ్చరించారు.
నేటినుంచి స్పాట్
అడ్మిషన్లకు అవకాశం
మన్ననూర్: స్థానిక ప్రభుత్వ ఆర్‌ఐటీఐ/ఏటీసీ మన్ననూర్ కళాశాలలో మిగిలి ఉన్న సీట్ల ప్రవేశానికి బుధవారం నుంచి ఈ నెల 28 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలలోపు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఐటీఐ కళాశాలలో కౌన్సెలింగ్‌కు హాజరై అడ్మిషన్ పొందవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఎస్‌ఎస్‌సీ, కులం, బోనోఫైడ్/ స్థానిక, బదిలీ, సర్టిఫికెట్లతోపాటు పాస్ పోర్టు సైజ్ ఫొటో స్కాన్ చేసి https://iti telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్/Emailid తో రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. 1– 2 దశల్లో దరఖాస్తు చేసుకొని సీటు పొందని అభ్యర్థులు మళ్లీ చేసుకోనవసరం లేదని, ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న ఆన్‌లైన్ ప్రింటెడ్ కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకావొచ్చన్నారు. పూర్తి సమాచారం కోసం సెల్ నంబర్లు 85004 61013, 85004 61022లను సంప్రదించాలని సూచించారు.
గడువు పొడిగింపు
కందనూలు: తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ పొడిగించడం జరిగిందని జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో చెల్లించాలని, అపరాధ రుసుంతో ఈ నెల 28 వరకు చెల్లించవచ్చని ఆయన సూచించారు.
‘అత్యాచార ఘటనలను అరికట్టడంలో విఫలం’
వీపనగండ్ల: మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని.. వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్రా మహిళా సంఘం) జిల్లా అధ్యక్షురాలు సాయిలీల ఆరోపించారు. జిల్లాకేంద్రంలో ఈ నెల 30, 31న నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు అవసరమైన నిధుల కోసం మంగళవారం మండల కేంద్రంలో విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుల దురాహంకార హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హింస సమాజాన్ని సవాల్ చేస్తున్నాయని.. వాటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు మద్దతు పలుకుతూ సామాన్య ప్రజలు, మహిళల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆస్పత్రుల్లో వైద్యులు, మందుల కొరత ఉందన్నారు. కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షురాలు శాంతమ్మ, జిల్లా కార్యవర్గసభ్యురాలు లలిత తదితరులు పాల్గొన్నారు.