
ప్రైవేట్‌లో ఫీజులుం
● నిబంధనలకు విరుద్ధంగా పెంపు, వసూళ్లు
● పుస్తకాలు, యూనిఫాంల పేరుతో అదనపు వ్యాపారం
● సామాన్య, మధ్య తరగతి
కుటుంబాలపై ఆర్థిక భారం
● నియంత్రణలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు
కందనూలు: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి అంతులేకుండా పోతోంది. తల్లిదండ్రుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత మూలాలు ఉన్న జిల్లాలో రూ.వేలల్లో ఫీజులు ఉండటం నివ్వెరపరుస్తోంది. ఒక స్కూల్ మించి మరో స్కూల్ పోటీ పడి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న ఫీజులతో సామాన్యుడికి ప్రైవేట్ బడి భారమవుతోంది. ముఖ్యంగా కార్పొరేట్, ఐఐటీ, సీబీఎస్‌ఈ సిలబస్ అని ఏటా 20 శాతం నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచేస్తున్నారు.
కార్పొరేట్ స్థాయిలో..
జిల్లాలో మొత్తం ప్రైవేట్ పాఠశాలలు 161 ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 8, ప్రాథమికోన్నత 79, ఉన్నత పాఠశాలలు 74 ఉండగా.. సుమారు 45 వేల మంది వరకు చదువుకుంటున్నారు. అయితే ఎల్‌కేజీ విద్యార్థులకు రూ.20 వేలు మొదలుకొని పదో తరగతి విద్యార్థులకు రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటికి అదనంగా ఐఐటీ, నీట్ పేరుతో మరికొంత ఫీజులు వసూలు చేయడం గమనార్హం. వీటికి తోడు అడ్మిషన్ ఫీజులు సైతం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు తీసుకోవద్దన్న నిబంధన ఉన్నప్పటికీ కొందరు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. అధిక ఫీజుల విషయంలో విద్యార్థి సంఘా లు, తల్లిదండ్రులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న విద్యాధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు.
యథేచ్ఛగా దోపిడి
ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలను అదేబడిలో తీసుకోవాల్సిందే. లేకపోతే యాజమాన్యాలు సూచించిన చోట మాత్రమే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. యాజమాన్యాలు సూచించిన చోటుకు వెళ్తే వారు చెప్పిందే రేటు.. లేదంటే మీ ఇష్టం అనే ధోరణిలో షాపుల యజమానులు వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల విద్యాహక్కు చట్టం నిబంధనలు ఉల్లంఘించేలా తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య ఉంటోంది. జిల్లాకేంద్రంలో అయితే మరీ దారుణంగా పాఠశాల ఒక దగ్గర ఉంటే.. తరగతులు ఇంకోచోట నిర్వహించడం, ఇతర పేర్లతో బోర్డు పెట్టి నడిపిస్తుండటం గమనార్హం.
వసతులు అంతంతే..
ముక్కుపిండి రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు.. అందుకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారా అంటే అదీ లేదు. చాలా పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు రాని పరిస్థితి. కనీసం ఆడుకోవడానికి మైదానాలు సైతం ఇవన్నీ తెలిసి కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది అంతుచిక్కడం లేదు.
నిబంధనలకు తూట్లు..
ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ప్రైవేట్‌లోనూ వి ద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు టీటీసీ పూర్తి చేసి టెట్ క్వాలీఫై అయ్యి ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో బో ధించే ఉపాధ్యాయులు బీఈడీ పూర్తి చేసి టెట్ క్వా లీఫై కావాల్సి ఉంటుంది. కానీ, కొన్ని పాఠశాలల్లో అవేమి పట్టనట్లుగా యాజమాన్యాలు డిగ్రీ పూర్తి చేసిన వారితో బోధన చేయించడం జరుగుతుంది.