
ఉపాధి కొత్త నిబంధనలు
అచ్చంపేట: ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొన్నిచోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కూలీల డబ్బులు దోచుకోవడం, మరికొందరు పరికి రాకున్నా అటెండెన్స్ వేయించుకుంటున్నారు. దీంతో ఇకపై పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉపాధి హామీ కూలీల హాజరులో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధి హామీలో పనిచేసేందుకు వచ్చిన కూలీల ఫొటోలను రెండు పూటలా తీయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని 20 మండలాల పరిధిలో అధికారులు గత నెల 14 నుంచి గ్రామాల వారీగా శాంపిళ్లను తీస్తున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు షరతులు
పనులు మంజూరు లేకుండా ఎలాంటి వర్క్ మొదలు పెట్టకూడదు. డిమాండ్ చేసి మస్టర్ మేట్‌కు ఇచ్చిన తర్వాతనే పని ప్రారంభించాలి. ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌కు రెండు, మూడు గ్రామ పంచాయతీలు ఉంటే.. ఒకే గ్రామ పంచాయతీలో పని ప్రారంభించాలి. పని మంజూరు లేకుండా పనిచేస్తే ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిగే నష్టం ఏమిటంటే ఒకవేళ ప్రమాదవశాత్తు ఎవరికై నా పనిప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పకడ్బందీగా పర్యవేక్షణ
ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసిన ఉపాధి కూలీల అటెండెన్స్ ఫొటోలన్నింటినీ ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వెరిఫై చేసి రిపోర్టును ఎంపీడీఓలకు పంపించాల్సి ఉంది. మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి ఒక రోజులో వచ్చిన మొత్తం ఫొటోల్లో కనీసం 20 శాతం ఫొటోలు లేదంటే గ్రామానికి రెండు ఫొటోల చొప్పున ఎంపీడీఓ కార్యాలయంలోని ఏపీఓ, కాంట్రాక్టు స్టాప్, పర్మనెంట్ స్టాప్ అదేరోజు వెరిఫై చేసి రిపోర్ట్‌ను కలెక్టర్, డీఆర్‌డీఓలకు పంపించాలి. జిల్లాస్థాయిలో ముందు రోజు క్యాప్చర్ చేసిన ఫొటోల్లో కనీసం 30 ఫొటోలను కలెక్టర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. డీఆర్‌డీఓ కాంట్రాక్ట్, పర్మనెంట్ స్టాప్ ఒక్కొక్కరు జిల్లావ్యాప్తంగా వచ్చిన మొత్తంలో రోజుకు10 శాతం లేదా 200 ఫొటోలను వెరిఫై చేయాలి. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రోజుకు 20 ఫొటోలను వెరిపై చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇకపై రెండు ఫొటోలు దిగితేనే వేతనం
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తేనే కూలీ మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
ఇప్పటికే అన్నిస్థాయిల్లో
శాంపిల్‌గా ఫొటోల పరిశీలన
అవకతవకలకు
చెక్ పెట్టేలా కఠిన చర్యలు
ఫొటో ఉంటేనే హాజరు..
కూలీలు పనులు చేసే ప్రదేశంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా రెండు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్పుడే వారికి వేతనం వస్తుంది. ఫొటో ఉంటేనే హాజరుగా పరిగణలోకి తీసుకుంటారు. ఫొటోలు అప్‌లోడ్ చేయకపోతే కూలీలకు వేతనం రాదు. ఈజీఎస్‌లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెల 14 నుంచి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. – ఓబులేష్,
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

ఉపాధి కొత్త నిబంధనలు