
రాములు దారెటో..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, నాగర్‌కర్నూల్: బీఆర్‌ఎస్‌ను వీడుతూ బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉదంతం ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు దశాబ్దాలుగా పైగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల అనూహ్యంగా పార్టీ మారడం పట్ల బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయనతో పాటు మరికొందరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతారన్న ప్రచారం నేపథ్యంలో వారంతా అయోమయంలో ఉన్నారు. అయితే పార్టీ మార్పుపై వదంతుల వ్యాప్తి ఉధృతంగా మారిన క్రమంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ తాము పార్టీ వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. గువ్వల బీజేపీలో చేరుతుండటంతో బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీలోని నేతలను సైతం కలవరపెడుతుండటం గమనార్హం.
భరత్ భవితవ్యంపై బెంగ..
సుదీర్ఘకాలంగా రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి రాములు గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. తన కుమారుడు భరత్‌ప్రసాద్ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలో చేరి.. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. రానున్న కాలంలోనూ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆశతో ఉన్నారు. అయితే గులాబీ పార్టీలో గువ్వలలో అంతర్గత పోరులో భాగంగా బీజేపీలో చేరితే.. ఇప్పుడు మళ్లీ గువ్వల రూపంలోనే పోటీ ఎదురవుతోందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మంత్రిగా, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పనిచేసిన రాములు కార్యక్షేత్రంపైనే ఆయన తనయుడు భరత్ ఆశలు పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉండగా జెడ్పీ చైర్మన్ పదవి, అచ్చంపేట ఎమ్మెల్యే సీటు, నాగర్‌కర్నూల్ ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ప్రధానంగా గులాబీ పార్టీలో గువ్వల బాలరాజు ప్రభావంతో తమకు అవకాశాలు దక్కలేదని భరత్‌ప్రసాద్ భావించారు. ఈ కారణాలతోనే రాములు సైతం కుమారుడితో కలసి పార్టీని వీడి అనూహ్యంగా బీజేపీలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు గువ్వల సైతం బీజేపీలోనే చేరుతుండటంతో భరత్‌ప్రసాద్ భవితవ్యంపై వారి అనుచరులు బెంగ పెట్టుకుంటున్నారు.
గువ్వల వెంట వెళ్లేందుకుకేడర్ విముఖత
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తన ముఖ్య అనుచరులు, కేడర్‌గా ముందుగానే చెప్పారు. వారి నుంచి సహకారం కావాలని, తనతో పాటుగా బీజేపీకి రావాలని ఆహ్వానిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్‌లో బీజేపీతో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి కన్నా ముందే తాము బీజేపీలో చేరితే గౌరవం నిలబడుతుందని కేడర్‌తో చెబుతున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా పనిచేయవచ్చని అంటున్నారు. అంబేద్కర్ ఆశయాలు, జాతీయవాదాన్ని ఆచరించే పార్టీతో పని చేస్తానని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనతో వెళ్లేందుకు బీఆర్‌ఎస్ కేడర్ విముఖంగా ఉందని తెలుస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, అనుచరులు గువ్వల పాటు బీజేపీకి వెళ్లేందుకు నిరాసక్తతను కనబరుస్తున్నారు. ఇప్పటికే గువ్వల పార్టీ మారుతున్న ప్రచారం మొదలైన క్రమంలోనే సోమవారం సీఎం రేవంత్ సమక్షంలో పదర మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, గువ్వల ముఖ్య అనుచరుడు రాంబాబునాయక్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం తక్కువగా ఉండటం, బీజేపీ కన్నా బీఆర్‌ఎస్ కేడర్ బలంగా ఉందన్న భావన నేపథ్యంలో ఎక్కువ మంది అనుచరులు బీజేపీలో చేరడానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కక కమలం గూటికెళ్లిన మాజీ ఎంపీ
బీజేపీలోకి గువ్వల రాక నేపథ్యంలో మళ్లీ అలజడి
కుమారుడి భవితవ్యంపై ఆందోళన
గువ్వల బాటలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు
పార్టీ మారినా.. తప్పని పోరు..
బీఆర్‌ఎస్‌లో గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ రాములు మధ్య సుదీర్ఘంగా కాలం పాటు సాగిన వర్గపోరు ఇప్పుడు పార్టీ మారినా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గులాబీ పార్టీలో గువ్వల ఆధిపత్యం నేపథ్యంలో రాములు కారు దిగి.. కమలం గూటికి చేరారు. రానున్న కాలంలో ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేదా నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా తమ కుమారుడిని దింపి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న తలంపుతో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ గువ్వల రంగప్రవేశంతో ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.

రాములు దారెటో..?

రాములు దారెటో..?