
కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం తగదు
నాగర్‌కర్నూల్: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం తగదని, అలా చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మాజీమంత్రి హరీశ్‌రావు బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కాళేశ్వరంపై వీడియో ప్రజెంటేషన్ నిర్వహించగా జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు గోదావరిపై అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు నీళ్లు రాని పరిస్థితుల్లో కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం పూర్తి చేస్తే సస్యశ్యామలం అయిందన్నారు. రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలన గాలి మోటార్లు ఎక్కి గాలి ముచ్చట్లు చెప్పడానికే సరిపోయిందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం పాలన పక్కకు పెట్టి రాజకీయ కక్ష్య సాధింపులే లక్ష్యంగా కొనసాగుతుందన్నారు. రేవంత్ పాలన ఒక టీవీ సీరియల్‌లా నడుస్తోందని దుయ్యబట్టారు. మొన్నటి వరకు ఫార్ములా–1 కేసు, నిన్న ఫోన్ ట్యాపింగ్ అన్నారు అందులో ఏం చేయలేకపోయే సరికి ఇప్పుడు కాళేశ్వరం మీద పడ్డారని ఎద్దేవా చేశారు.
చివరి అడుగూ కేసీఆర్‌తోనే..
ఎమ్మెల్యేగా తొలి అడుగు కేసీఆర్‌తో ప్రారంభమైందని చివరి అడుగు వరకు ఆయనతోనే ఉంటానని మర్రి జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్న గువ్వల బాలరాజును సముదాయించేందుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా తనపై దష్ప్రచారం చేసిందన్నారు. రాజకీయంగా తెలిసీ తెలియక మొదట టీడీపీ నుంచి పోటీ చేశానని, తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. పదేళ్లపాటు దేవుడిగా ఉన్న కేసీఆర్ పోడిపోతే దెయ్యం అవుతాడా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ తాను జీవితంలో ఎన్నో పదవులు అనుభవించానని, ఇక పార్టీలు మారాల్సిన అవసరం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఎవరికీ లేదని, వచ్చే స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు.