
తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవి
నాగర్‌కర్నూల్ క్రైం: శిశువు పుట్టిన వెంటనే తల్లి నుంచి వచ్చే ముర్రుపాలు పట్టడం వల్ల శిశువులో రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రి గైనిక్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలతోపాటు రీహాబిలిటేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవని, పుట్టిన శిశువు నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు అండాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు దరిచేరవన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తులు, మానసిక రోగులుగా మారిన వారికి జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, గైనిక్ హెచ్‌ఓడీ నీలిమ, వైద్యులు సుప్రియ, సౌమ్య, కవిత, రవిశంకర్, అంబుజ, హెల్ప్‌డెస్క్ ఇన్‌చార్జ్ యాదగిరి పాల్గొన్నారు.