
రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు
నాగర్‌కర్నూల్: జిల్లాలోఎరువులు, యూరియా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు అన్నారు. మంగళవారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, కోపరేటివ్, రవాణా అధికారులు, ఏడీఏలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి– వ్యవసాయ సంచాలకులు గోపి రైతులకు యూరియా సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. ఈ మేరకు జిల్లా నుంచి డీటీఓ చిన్నబాలు, డీసీఓ రఘునాథ్, ఏడీఏలతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా గురించి వివరిస్తూ ఏడీఏలు, మండల వ్యవసాయాధికారులు వారి పరిధిలోని అన్ని ఎరువుల దుకాణాలు, అనుమానాస్పద ప్రదేశాలు, పరిశ్రమలు సందర్శించి యూరియా వ్యవసాయేతర అవసరాలకు వాడితే కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రతి ఎరువుల డీలరు వారి వద్ద ఉన్న ఎరువుల స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శింపజేస్తామన్నారు. రైతులు ఎరువుల పంపిణీలో ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబరు 89777 41771 స్టాక్ బోర్డుపై తెలియపరుస్తామన్నారు. ప్రతి సహకార సంఘం ఉదయం 8 గంటలకే తెరిచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
చారకొండ: మండల కేంద్రంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్‌లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రత్యేకాధికారి మంజుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్‌లో ఖాళీగా ఉన్న 12 సీట్ల భర్తీకి.. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పోడు భూముల్లో
సాగుకు అనుమతించాలి
అమ్రాబాద్: ఆదివాసీ చెంచులు సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వడంతోపాటు కండ్లకుంట భూమిలో సాగుకు అనుమతించాలని జిల్లా చెంచు సేవా సంఘం అధ్యక్షుడు నాగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని జంగంరెడ్డిపల్లి గ్రామంలో చెంచు కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కండ్లకుంట భూమిలో సాగుకు అనుమతించకపోతే చెంచులతో కలిసి ఆందోళనలు చేపడుతామన్నారు. సంఘం జిల్లా నాయకుడు నాగయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి తాతలు, తండ్రులు కండ్లకుంట భూమిని సాగుచేస్తు అక్కడి అడవులు, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లకుండా జీవనం సాగించారని, తాము అలాగే ముందుకెళ్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకారం తమకున్న అవకాశాల్లో చెంచులు ఎవరూ పోటీ చేయమని, ఓటుహక్కు సైతం వినియోగించుకోమని తేల్చిచెప్పారు.
‘స్థానికం’లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
పెద్దకొత్తపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు అభివృద్ధిని మరిచిపోయి.. ప్రశ్నించే బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులను పెట్టిస్తున్నారని విమర్శించారు. పోలీస్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు వెళ్తే అధికారులు పనిచేయకుండా వేధిస్తున్నారన్నారు. అనంతరం స్థానిక గురుకుల పాఠశాల మాజీ ఎమ్మెల్యే సందర్శించారు. పాఠశాలలో 19 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైతే కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఎవరూ పాఠశాలను సందర్శించలేదని విమర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు పాఠశాల వద్దకు వస్తే విద్యార్థులకు పరీక్ష నిర్వహించడంతో ఆయన గేటు ముందే విలేకరులతో మాట్లాడారు. సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు.

రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు