
అందుబాటులో 6,119 మె.ట. యూరియా
కందనూలు: జిల్లాలో ప్రస్తుతం 6,119 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొక్కజొన్న పంటకు ఎకరా 5 బస్తాల యూరియా మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. అధికంగా యూరియా వినియోగించడం వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఫర్టిలైజర్ దుకాణ డీలర్లు ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలని.. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పనిచేస్తున్న ఏడీఏలు, ఏఓలు అప్రమత్తంగా ఉండాలని, రోజు సహకార సంఘాలను సందర్శించి రైతులకు సరపడా ఎరువులు సకాలంలో అందించాలని ఆదేశించారు.