
చదువుతోనే సమాజంలో గుర్తింపు
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఇంటర్ విద్య భవిష్యత్‌కు కీలక దశ అని.. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ఉన్నతస్థాయిలో స్థిరపడినప్పుడే సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని విద్యార్థులకు సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని.. అప్పుడే సమాజంలో నేరాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి పాల్గొన్నారు.