
రాయితీ ఎరువులు సిద్ధం
వనపర్తి: రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి భూ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ ఏటా పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందుకు రైతులకు 50 శాతం రాయితీపై మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో పంపిణీ షురూ చేశారు. ఉమ్మడి పాలమూరులోని ఆయా జిల్లాలకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువుల ఇండెంట్ ఆధారంగా జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ జీలుగ, జనుము రకాల విత్తనాలను సిద్ధం చేసింది. వనపర్తి జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కర్మాగారంలో ఐదు జిల్లాలకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసి తొలకరి వర్షాలు కురుస్తున్న ప్రస్తుతం సమయంలో సరఫరా కోసం ఆయా ప్రాంతాలకు పంపిణీ చేశారు. జీలుగ రకం ఉమ్మడి పాలమూరు జిల్లాకు 7 వేల క్వింటాళ్లు, జనుము 760 క్వింటాళ్లను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులకు ఈ విత్తనాలను వారి అభ్యర్థన మేరకు ఆయా రకాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తారు.
పచ్చిరొట్టతో ఉపయోగాలిలా..
పచ్చిరొట్ట ఎరువులతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. వ్యవసాయ పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం పరిమితికి మించడంతో భూమిపై గల సారవంతమైన పొర చౌడు నేలగా మారే ప్రమాదం ఉంది. ఏటా ఖరీఫ్ పంటల సాగుకు ముందు వర్షాధారంగా పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి భూమిలో కలియదున్నడం వలన భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించకుండా ఈ పచ్చిరొట్ట ఎరువులు వాటి మనుగడను కాపాడుతాయి. నేలపై పొరలోని సహజ భౌతిక లక్షణాల రక్షణకు ఉపయోగపడతాయి.
ఇదే అనువైన సమయం..
పచ్చిరొట్ట ఎరువుల నాటేందుకు ప్రస్తుత సమయం అనువైనదని ఇటీవల నిర్వహించిన శాస్త్రవేత్తల పల్లెబాట కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. తొలకరి వర్షాలు ప్రారంభమైన వెంటనే పచ్చిరొట్ట ఎరువు నాట్లు వేసుకోవాలి. సాధారణ పంటల సాగుకు ముందు 45 రోజుల ముందు ఈ పచ్చిరొట్ట ఎరువులను నాటుకుంటే.. పచ్చిరొచ్చ మొక్కలు పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదున్నేందుకు అవకాశం ఉంటుంది.
రాయితీ వివరాలు ఇలా..
ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జీలుగ, జనుము రెండు రకాల పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తోంది. జీలుగ క్వింటాల్‌కు రూ.14,250 కాగా.. రాయితీపై కేవలం రూ.7,425కు, జనుము పూర్తి ధర క్వింటాల్‌కు రూ.12,550 ఉండగా.. రాయితీపై రూ.6,275కే రైతులకు అందజేస్తోంది.
చాలా ఉపయోగం..
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 50 శాతం రాయితీపై అందజేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలను ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో డిమాండ్ మేరకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రసాయనిక ఎరువుల వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి ఒకసారి పచ్చిరొట్ట ఎరువుల వాడకం పొలానికి చాలా ఉపయోగకరం.
– ఆదినారాయణరెడ్డి, రీజినల్ మేనేజర్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, వనపర్తి
జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ఎరువులు ఇలా (క్వింటాళ్లలో)..
అందుబాటులో జనుము, జీలుగ రకాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంపిణీచేసేందుకు చర్యలు
వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చినఇండెంట్ మేరకు సరఫరా