
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కందనూలు: జిల్లా కేంద్రంలో సబ్‌స్టేషన్ మరమ్మతు కారణంగా ఆదివారం ఉదయం 10 నుంచి మధ్మాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఓ శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉయ్యాలవాడ మెడికల్ కళాశాల నుంచి శ్రీపురం రోడ్డుకు ఇరువైపులా, శ్రీపురం రోడ్డు నుంచి బీసీకాలనీ, రూబీ గార్డెన్, డిగ్రీ కళాశాల వరకు ఇరువైపులా, నెల్లికొండ రోడ్డు నుంచి కొల్లాపూర్ చౌరస్తా, మంతటి, పెద్దముద్దునూరు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఇందుకు గాను వినియోగదారులు, రైతులు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు.
ఇంటర్ పరీక్షలకు185 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం మూడోరోజు జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాల్లో గణితం, బాటనీ, పౌరశాస్త్రం పరీక్షలు నిర్వహించగా ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులు 3,126 మందికి గాను 2,978 మంది హాజరవగా.. 148 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 874 మందికి గాను 837 మంది హాజరవగా.. 37 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి పాక్షిక శనిత్రయోదశి సందర్భంగా శనివారం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తిలతైలాభిషేకాలతో పూజలు చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల చేత శనిదోష నివారణ కోసం గోత్రనామార్చన, అభిషేకాలు, అర్చనలు వంటి పూజలను అర్చకులు చేయించారు. భక్తులు శనేశ్వరుడి పూజల అనంతరం శివాలయంలో బ్రహ్మసూత్ర శివుడికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టుపై పట్టుసాధించాలి
కందనూలు/ తిమ్మాజిపేట/ బిజినేపల్లి: ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని, ఆంగ్లంలోనే బోధన చేయాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శనివారం తిమ్మాజిపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎప్పటికప్పుడు బోధనలో నూతన విధానాలను అలవర్చుకోవాలని, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను గ్రామాల్లో తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రసుత్తం ఉన్న ప్రణాళిక ప్రకారం బోధిస్తే అదనపు సమయం అవసరం లేదన్నారు. మీ దగ్గర క్వాలిటీ ఉంటే మీరు బోధనను శ్రద్ధగా విని ఉత్తమ పౌరులుగా ఎదిగిన వారే మీ గురించి చెప్పడం వల్ల కూడా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయుల కరదీపికను విడుదల చేసి రీసోర్స్‌పర్సన్లను సన్మానించారు. అలాగే బిజినేపల్లి మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు ఐదు రోజులుగా నిర్వహించిన వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ పరిశీలించారు. మొత్తంగా శనివారంతో ఉపాధ్యాయ శిక్షణ తరగతులు ముగిసినట్లు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం జిల్లాస్థాయిలో 1,934 మంది, మండల స్థాయిలో 1,368 మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈఓలు సత్యనారాయణశెట్టి, రఘునందన్‌రావు, ఆయా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం