
జైలులో సత్ప్రవర్తనతో ఉండాలి
పాలమూరు: పలు రకాల కేసుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పూర్తిగా సత్ప్రవర్తనతో మెలగాల్సిన అవసరం ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రధాన జైలును బుధవారం న్యాయమూర్తి సందర్శించారు. మొదటగా ఖైదీలకు తయారు చేసే ఆహారం, వంట గది, ఖైదీలు ఉండే బ్యారక్‌లను పరిశీలించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న వసతులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ జైలు జీవితం తర్వాత ఎలాంటి తప్పులు చేయకుండా కుటుంబం కోసం ఉత్తమ జీవనం సాగించాలన్నారు.