
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
నాగర్‌కర్నూల్ రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సీపీఎం నాయకులు సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగులు అందుబాటులో లేవని చెబుతూ సకాలంలో రైతుల నుంచి ధాన్యం సేకరించడం లేదన్నారు. అదే విధంగా క్వింటాల్‌కు 3 నుంచి 4కిలోల ధాన్యం అదనంగా తూకం వేస్తూ రైతులను దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులందరూ ధాన్యం తీసుకువచ్చి మార్కెట్‌లో పోస్తే కొనుగోలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు పర్యవేక్షించి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందికొండ గీత, నాయకులు రామయ్య అశోక్, మధు, సుభాష్, శివరాం పాల్గొన్నారు.