
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
కల్వకుర్తి రూరల్/చారకొండ: జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించి.. నిజమైన అర్హులను ఇళ్లకు ఎంపిక చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న రఘుపతిపేట గ్రామాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులు నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు. కాగా, గ్రామంలో 130 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 70 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. మిగతా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. కలెక్టర్ స్వయంగా లబ్ధిదారులను కలిసి సమస్యను తెలుసుకున్నారు. లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు ప్రారంభించే విధంగా అవగాహన కల్పించాలని ఆర్డీఓ శ్రీనునాయక్‌కు సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా సిమెంటు, ఇతర సామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు లింగసానిపల్లిలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ ఏఈకి కలెక్టర్ సూచించారు. అనంతరం రఘుపతిపేటతో పాటు చారకొండ, జూపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తూకం వేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యాన్ని దించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, చారకొండ మండలం తిమ్మాయిపల్లి వద్ద ప్రధాన రహదారిపై ఆరబెట్టిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. జూపల్లిలో రైతువేదిక వద్ద ధాన్యం కొనుగోలుకు స్థలం అనువుగా లేకపోవడంతో ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోసినట్లు రైతులు వివరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ వెంకట్రాములు, ఆర్‌ఐ భరత్ తదితరులు ఉన్నారు.
పారదర్శకంగా సర్వే నిర్వహించాలి
కలెక్టర్ బదావత్ సంతోష్