
బడుల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీ
కందనూలు: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ రమేశ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాము నుంచి 20 కేజీబీవీలు, 28 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలకు పాఠ్యపుస్తకాల సరఫరాను డీఈఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభం నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 1నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పూర్తిస్థాయిలో పుస్తకాలు అందిస్తామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్, కేజీబీవీ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న 70,390 మంది విద్యార్థులకు 3,98,660 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 80 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్ నర్సింహ, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, వెంకటేశ్వర్లు శెట్టి, శివకుమార్ పాల్గొన్నారు.