
సప్లిమెంటరీకి పకడ్బందీ ఏర్పాట్లు
కందనూలు: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ సంవత్సరం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 6,045 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 3,138 మంది, ఒకేషనల్ విభాగంలో 626 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 1,894 మంది, ఒకేషనల్ విభాగంలో 387 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. తాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలతో పాటు ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
25 మంది చొప్పున సీటింగ్..
పరీక్ష కేంద్రంలోని ఒక్కో గదిలో 25 మంది విద్యార్థుల చొప్పున కూర్చొనే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్ కాఫీయింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీ బృందాలను నియమించారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంట్ అధికారి, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి పోలీస్‌స్టేషన్ నుంచి తీసుకువచ్చే ప్రశ్నపత్రాల సీల్ తీయడం మొదలుకొని.. విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను సీల్ వేసే వరకు సీసీ కెమెరాల నిఘాలో పూర్తి చేయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్‌కు తప్ప మిగతా వారికి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాల్లోకి సంబంధిత అధికారి జారీ చేసిన ఐడీ కార్డులు కలిగిన వారిని తప్ప.. ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.
నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
జిల్లావ్యాప్తంగా
20 కేంద్రాల ఏర్పాటు
హాజరుకానున్న
6,045 మంది విద్యార్థులు