
నిలిచిన ‘సీయూఈటీ’
షార్ట్‌సర్క్యూట్ కారణంగా పనిచేయని కంప్యూటర్లు
● మహబూబ్‌నగర్ ‘ఫాతిమా’ స్కూల్
కేంద్రంలో పరీక్షకు దూరమైన
180 మంది విద్యార్థులు
● న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) స్థాయిలో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు) నిర్వహిస్తోంది. వివిధ గ్రూపుల విద్యార్థులు ఈ నెల 13 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 180 మంది విద్యార్థులు బుధవారం ఉదయం సెషన్ 9 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఉదయం వర్షం కారణంగా పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ఉన్న ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు సైతం ఆఫ్ అయ్యాయి. గంట తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా.. మళ్లీ 10 నిమిషాల్లోనే మరోసారి షార్ట్ సర్క్యూట్‌తో సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 180 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో వారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.
దేశవ్యాప్తంగా కొనసాగిన పరీక్ష
దేశవ్యాప్తంగా 60కి పైగా సెంట్రల్ యూనివర్సిటీల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ఆన్‌లైన్‌లో ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి రూ.950 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం దేశవ్యాప్తంగా పరీక్ష కొనసాగగా.. ఒక్క మహబూబ్‌నగర్‌లోని ఫాతిమా విద్యాలయ పరీక్ష కేంద్రంలో మాత్రం జరగలేదు. పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం కూడా బయటికి వచ్చాక.. మరోసారి పరీక్ష ఎలా నిర్వహిస్తారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఫాతిమా విద్యాలయ ప్రిన్సిపాల్ థెరిస్సా మాదను స్పందిస్తూ.. పరీక్ష నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి) సమాచారం ఇచ్చామని.. మరోసారి పరీక్ష నిర్వహించే విధంగా ఎన్టీఏ చర్యలు తీసుకుంటుందని చెప్పినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.
వర్షంలో తడుచుకుంటూ వచ్చాం..
రాత్రి 2 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి, ఉదయం 6 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాం. షార్ట్ సర్క్యూట్‌తో పరీక్ష నిలిచిపోతే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంట్ పోతే మేమేం చేయాలని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు పరీక్ష కేంద్రం ఎందుకు పెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి మా పిల్లలకు న్యాయం చేయాలి.
– సునీత, విద్యార్థిని తల్లి, గద్వాల
పరీక్ష జరగలేదు.
సీయూఈటీ పరీక్ష రాసేందుకు రాత్రి బయలుదేరి మద్దూరు నుంచి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక షార్ట్ సర్క్యూట్‌తో కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.
– మహేశ్‌కుమార్, విద్యార్థి, మద్దూరు
ఏపీ ఎంసెట్ వదులకున్నా..
పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటసేపు వరకు పునరుద్ధరించలేదు. అప్పటికే సమయం కూడా ముగిసింది. అనంతరం పరీక్ష నిర్వాహకులు వచ్చి పరీక్షకు మరోసారి ఎన్టీఏ వారు సమాచారం ఇస్తారు.. అప్పడు వచ్చి పరీక్ష రాయాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసి ఇక్కడ మాత్రం నిర్వహించలేదు. ఏపీ ఎంసెట్ వదులుకుని ఈ పరీక్షకు వచ్చాను. న్యాయం చేయాలి.
– సాయివర్షిణి, విద్యార్థి, మరికల్
మరో అవకాశం ఇవ్వాలి..
సీయూఈటీ పరీక్ష రాయడానికి మరికల్ నుంచి వచ్చాను. కొన్ని రోజులుగా పరీక్ష కోసం సిద్ధమయ్యాను. తీరా పరీక్షకు వస్తే విద్యుత్ సరఫరా నిలిచిపోయి కంప్యూటర్లు పనిచేయలేదు. ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహిస్తుందా.. లేక రీషెడ్యూల్ చేస్తారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలి.
– రామకృష్ణ, విద్యార్థి, మరికల్

నిలిచిన ‘సీయూఈటీ’

నిలిచిన ‘సీయూఈటీ’

నిలిచిన ‘సీయూఈటీ’

నిలిచిన ‘సీయూఈటీ’