
కాంట్రాక్టు కార్మికుల వేతనాలు చెల్లించండి
నాగర్‌కర్నూల్ రూరల్: కాంట్రాక్టు కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారన్నారు. కార్మికులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్మికులతో పనులు చేయించుకుంటూ ప్రతినెలా వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని.. లేనిపక్షంలో నిరవధిక సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రిజ్వాన్, నాగమణి, ఎల్లమ్మ, శ్రీదేవి, అలివేల, రేణుక, నాగయ్య, వెంకటేశ్, కాశన్న తదితరులు పాల్గొన్నారు.