
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
నాగర్‌కర్నూల్/పెంట్లవెల్లి: రాజీవ్ యువవికాసం పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్ కార్పొరేషన్, అధికారులతో రాజీవ్ యువవికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి జిల్లావ్యాప్తంగా 41వేల దరఖాస్తులు అందాయని.. దరఖాస్తు దారులతో సంబంధిత అధికారులు ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు. ఇంటర్వ్యూలో ఎంపిక చేసిన లబ్ధిదారుల దరఖాస్తులను బ్యాంకర్లు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు సూచించిన వాటిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో అర్హుల తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. జూన్ 2న అర్హులైన వారికి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాంలాల్, బీసీ వెల్ఫేర్ అధికారి ఖాజా నజీమ్ అలీ అప్సర్ తదితరులు ఉన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయాలి..
అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అమరేందర్, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న 15 రోజులు ఎంతో కీలకమని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేయొద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలు, లారీల కొరత లేకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరగా రైస్‌మిల్లులకు తరలించాలని తెలిపారు. ఉన్నతాధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిత్యం తనిఖీలు చేయాలని.. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు 75వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారులు హైదర్ అలీ, రాజేందర్, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, డీసీఓ రఘునాథరావు ఉన్నారు.
● పెంట్లవెల్లి మండలం కొండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో రైతులు సమర్పించిన భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా పెంట్లవెల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకొని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ విజయసింహ, మాజీ సర్పంచ్ గోపాల్, మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్, ఎంఈఓ ఇమానీయల్, ఏపీఎం గౌసుద్దీన్ ఉన్నారు.
రాజీవ్ యువవికాసం పథకానికి41వేల దరఖాస్తులు
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో అర్హుల జాబితా సిద్ధం
కలెక్టర్ బదావత్ సంతోష్