
ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన
పెంట్లవెల్లి: రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు గురువారం రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారి గణపతిరెడ్డి బృందం ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికిగాను మండలంలోని జటప్రోల్‌లో స్థల పరిశీలన చేపట్టారు. గ్రామంలోని సర్వేనంబర్లు 176, 177లోని 22 ఎకరాల భూమిని పరిశీలించి మాట్లాడారు. టెండర్ ప్రక్రియ పూర్తయినందున స్థల పరిశీలన చేపట్టామని.. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎస్‌ఈ, డిప్యూటీ ఏఈ, తహసీల్దార్ విజయసింహకు సూచించారు. వారి వెంట వైస్ ఎంపీపీ భీంరెడ్డి, నాగిరెడ్డి, కృష్ణయ్య, గోవిందరావు, శ్రీను ఉన్నారు.
ప్రారంభమైన ఇంటర్
సప్లిమెంటరీ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా తెలుగు, సంస్కృతం పరీక్షలు నిర్వహించగా.. 20 కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 1,182 మందికిగాను 1,098 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 895 మందికిగాను 838 మంది, ఒకేషనల్ విభాగంలో 287 మందికిగాను 260 మంది పరీక్షలు రాశారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 340 మంది విద్యార్థులకుగాను 319 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 305 మందికిగాను 287 మంది, ఒకేషనల్ విభాగంలో 35 మందికిగాను 32 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
చివరి గింజ వరకు
కొనుగోలు చేస్తాం
తెలకపల్లి: రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని డీఆర్డీఓ చిన్న ఓబులేష్ అన్నారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ధాన్యం.. దైన్యం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 300 క్వింటాళ్ల వరి ధాన్యం పండించగా విక్రయించేందుకు 15 రోజులుగా కేంద్రంలోనే పడిగాపులు పడుతున్నానని, తేమ పేరుతో కొనుగోలు చేయడం లేదని రైతు కొమ్ము శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయిందని తెలిపారు. అకాల వర్షాలకు తేమ శాతం తగ్గడంతో అధికారులు కాలయాపన చేయడంతో నష్టం వాటిల్లుతుందని వివరించారు. తేమ శాతం 14 ఉన్నా కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. డీపీఎం శ్రీనివాసులు, ఏపీఎం చంద్రయ్య ఉన్నారు.
రసాయన ఎరువుల
వినియోగం తగ్గించాలి
కల్వకుర్తి రూరల్: రైతులు పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని డా. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొ. త్రివేణి అన్నారు. గురువారం మండలంలోని వెంకటాపూర్‌లో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. రసాయన ఎరువుల వినియోగంతో కాలుష్యం పెరిగి మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్నారు. మరో శాస్త్రవేత్త డా. స్వరూపారాణి సాగునీటిని ఆదా చేసే పద్ధతులు, చెట్ల పెంపకంతో కలిగే లాభాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను రైతులకు అందజేశారు.