
భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మిగిలిన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవినాయక్ ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా సాగునీటి పారుదలశాఖ, ఇంజినీరింగ్ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే ల్యాండ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్యాకేజీలలో కొనసాగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న కృత నిశ్ఛయంతో ఉందని, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని, నీటిపారుదల, రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగం పెంచాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియలో సమస్యలు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు సందర్శించి ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. జిల్లాలోని కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, మార్కండేయ, అచ్చంపేట, కర్నె తండా, డిండి ప్రాజెక్టుల కోసం అవసరమైన భూ సేకరణ చేపట్టి పనుల పురోగతిలో ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. సమావేశంలో నీటిపారుదలశాఖ సీఈ విజయభాస్కర్, ఎస్‌ఎన్‌రెడ్డి, ఈఈలు శ్రీకాంత్, మురళి, ఆర్డీఓలు మాధవి, బన్సీలాల్, సురేష్, శ్రీనివాసులు, సర్వే అధికారి సరిత పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి
జి.రవినాయక్