
వచ్చే నెలలో ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు
కొల్లాపూర్: జాతీయ రహదారి–167కెలో భాగంగా మల్లేశ్వరం– సంగమేశ్వరం మధ్యన కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ సస్పెన్సివ్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని నేషనల్ హైవే అథారిటీ అధికారులు పరిశీలించారు. గురువారం ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ ఆర్‌ఓ కృష్ణప్రసాద్ కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులను పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్యాకేజీ–1 పనుల పూర్తికి నిర్ణీత గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో పనుల పురోగతిపై చర్చించారు. జూలై నెలాఖరు వరకు పనులు దాదాపుగా పూర్తిచేస్తామని కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు ఆయనకు వివరించారు. నాగర్‌కర్నూల్ నుంచి తాడూరు వరకు బైపాస్ రహదారి నిర్మాణ పనులకు భూ సేకరణ సమస్య ఉందని చెప్పారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆర్‌ఓ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల బ్రిడ్జి టెండర్ల ఖరారు వాయిదా పడుతుందన్నారు. అయితే ఇప్పటికే పలు కంపెనీలు బ్రిడ్జి నిర్మాణం కోసం బిడ్లు దాఖలు చేశాయని, వచ్చే నెలలో టెండర్ల ఖరారు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. బ్రిడ్జికి అనుసంధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్మించే రహదారి కోసం అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు చెప్పారు. వాటికి సంబంధించిన నివేదికలను ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులకు పంపించామన్నారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే రవాణా పరంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతకు ముందు ఆర్‌ఓ సంగమేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్‌ఓ వెంట ఈఈలు ఆదిత్య, రాజేందర్ తదితరులున్నారు.
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని
పరిశీలించిన ఎన్‌హెచ్‌ఏఐ ఆర్‌ఓ