
బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
కల్వకుర్తి టౌన్/వెల్దండ: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా ప్రతి ఉపాధ్యాయుడు తమ బోధనా పద్ధతులు కాలానికి అనుగుణంగా మెరుగుపర్చుకొని, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందని రాష్ట్ర విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య అన్నారు. గురువారం కల్వకుర్తి, వెల్దండలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ఆయన సందర్శించి తగిన సలహాలు సూచనలిచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు శిక్షణలో పూర్తిస్థాయిలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలుచేసి రాష్ట్రాన్ని విద్యా ప్రమాణాల పరంగా ముందువరుసలో నిలబెడతారనే నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా వ్యవస్థ బలోపేతానికి రూ.17 వేల కోట్లు ఖర్చు చేస్తుందని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1.10 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, 16.80 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు మరింత సమర్థవంతంగా పని చేయాలని, ప్రధానోపాధ్యాయుడు విధిగా తరగతి గదిలో పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విధ్యాధికారులు తమ పర్యవేక్షణలో మెరుగైన బోధన పద్ధతులు ఉపాధ్యాయులు అవలంబించేలా చూడాలన్నారు. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి వెంకటయ్య, నర్సింహ, మురళిమనోహరాచారి, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యార్థుల సంఖ్య పెంచాలి : డీఈఓ
పెద్దకొత్తపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలతో పాటు యూనిఫామ్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని.. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధిస్తారని గ్రామాల్లో ప్రచారం చేస్తూ విద్యార్థుల సంఖ్య పెంచాలని వివరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య