ప్రాజెక్టులకు నీటి ప్రవాహం | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు నీటి ప్రవాహం

May 23 2025 12:11 AM | Updated on May 23 2025 12:11 AM

ప్రాజెక్టులకు నీటి ప్రవాహం

ప్రాజెక్టులకు నీటి ప్రవాహం

గద్వాల/ ధరూరు/ దోమలపెంట: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని రెండు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెల చివరలోనే కొత్త నీటి రాక మొదలైంది. గురువారం ఎగువ ప్రాంతం నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 8,953, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి 8,940 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లోలు వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్‌, జూలైలో కృష్ణానదికి వరదలు వస్తుంటాయి. జూరాల ప్రాజెక్టుకు కొన్ని నెలలుగా ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు దాపురించారు. మొన్నటి వరకు 3 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం రెండు రోజులుగా వస్తున్న ఇన్‌ఫ్లోతో దాదాపు 1.25 టీఎంసీల నీరు చేరిందని అధికారులు చెప్పారు. డెడ్‌ స్టోరేజీ దశలో ఉన్న జూరాలకు స్థానికంగా కురుస్తున్న అకాల వర్షాలు కొంత మేలు చేశాయి. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.175 టీఎంసీల నీరు నిల్వ ఉందని పీజేపీ అధికారులు తెలిపారు.

సుంకేసుల, హంద్రీ నుంచి..

శ్రీశైలం జలాశయానికి గురువారం సుంకేసుల నుంచి 8,690, హంద్రీ నుంచి 250 కలిపి మొత్తం 8,940 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చిందని జలాశయం గేజింగ్‌ నిర్వాహకులు తెలిపారు. కాగా.. గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలం ఎగువన రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకి 1,305 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 817.2 అడుగుల వద్ద 38.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

జూరాల స్టాప్‌లాక్‌ గేట్ల ఓవర్‌ఫ్లో

జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జూరాలకు వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో గేట్ల మరమ్మతు చేసే క్రమంలో ప్రధాన గేట్లకు రక్షణగా ఉన్న స్టాప్‌లాక్‌ గేట్లపై నుంచి వర్షపు నీరు పొంగిపొర్లినట్లు ఎస్‌ఈ రహీముద్దీన్‌ తెలిపారు.

జూరాలకు 8,953,

శ్రీశైలానికి 8,940 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

జూన్‌కు ముందే మొదలైన కొత్త నీటి రాక

రామన్‌పాడులో 1,016 అడుగులు..

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల జలాశయం ఎడమ, కుడి కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని.. రామన్‌పాడు జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement