
కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే సరైన న్యాయం పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నసీమా సుల్తానా అన్నారు. గురువారం మే డేను పురస్కరించుకొని మండలంలోని నల్లవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం నిర్వహించి న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ 19వ శతాబ్దపు చివరలో కార్మికులతో ఎక్కువ పనిగంటలు చేయించుకుని తక్కువ జీతాలు ఇచ్చేవారని కార్మికుల ఉద్యమం తర్వాత 8 గంటలు మాత్రమే రోజుకు పనిచేయాలని, తగిన వేతనం ఇచ్చేలా మార్పులు వచ్చాయన్నారు. వేతనాల విషయంలో సీ్త్ర, పురుషుల మధ్య తేడా లేకుండా వారికి సమాన వేతనం ఇవ్వడం జరుగుతుందని, దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిన తర్వాత కార్మికుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు కార్మిక శాఖలో ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేసుకోవాలని, భవన నిర్మాణ కార్మికులు, ఇతర పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ప్రమాదవశాత్తు గాయ పడిన, చనిపోయిన ప్రమాద బీమా తీసుకోవడం ద్వారా వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లభిస్తు ందన్నారు. ఎవరైనా కార్మికులు ఆర్థిక స్థోమత లేకుంటే కోర్టు కేసుల్లో ఉన్నవారికి ఉచితంగా న్యాయ సేవాధికార సంస్థ తరపున న్యాయవాదిని నియమిస్తామన్నారు. జూన్‌లో జరిగే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొని సామ రస్య పూర్వకంగా కేసులు పరిష్కరించుకోవాలని సూ చించారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు శ్రీరామ్ ఆర్య, న్యాయవాదులు రామచందర్, మాధవ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.