
త్వరలోనే వనపర్తికి ఈఎస్‌ఐ ఆస్పత్రి
వనపర్తి టౌన్: కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పుర కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో లక్షలాది మందికి నిరంతరాయంగా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు కొత్త నియమకాలను చేపడతామన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం కార్మికులకు ప్రతి బెనిఫిట్‌ను అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు విజయ చందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మహేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, లైట్, హెవీ వెహికల్స్ సంఘం అధ్యక్షులు అయూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.