
ఉగ్రవాదాన్ని నిర్మూలించి దేశ ఐక్యత చాటాలి
కందనూలు: ఉగ్రవాదాన్ని నిర్మూలించి దేశ ఐక్యతను చాటాలని కవులు, రచయితలు తమ కవితల ద్వారా నిరసన గళాన్ని వినిపించారు. జమ్ముకాశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రముఖ కవి గుడిపల్లి నిరంజన్ అధ్యక్షతన ‘ఉగ్రవాదం నశించాలని’ అంశంపై కవులు, రచయితలు తమ కవితలు చదివారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించి, దేశ ఐక్యత చాటాలని, అన్ని మతాల మధ్య మతసామరస్యం పెంపొందించాలని ఆకాంక్షించారు. అలాగే మతాల మధ్య విద్వేషం కాకుండా సామరస్య పూరిత వాతావరణం నెలకొనాలని, లౌకిక ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ విలువలు ప్రతి పౌరుడు పాటించాలని కవులు తమ కవితల ద్వారా పాటల రూపంలో తెలియజేశారు. సరిహద్దులో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఇలాంటి తీవ్రవాద చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో కవులు, రచయితలు ముచ్చర్ల దినకర్, ఎదిరేపల్లి కాశన్న, కందికొండ మోహన్, కొంగరి జానయ్య, సోమశిల సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.