మంగపేట: మండల కేంద్రంలోని శ్రీ ఉమాచంద్రశేఖరస్వామి ఆలయంలో ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మైల నరేశ్‌రెడ్డి, ఆలయపూజారి నరేశ్ శర్మ తెలిపారు. విజయదశమి(దసరా) ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో 9 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల వివరాల కరపత్రాలను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అలయ ప్రాంగణంలో ఆదివారం ఆవిష్కరించారు. 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి దుర్గాదేవి అమ్మవారి శోభాయాత్ర నిర్వహించనున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చాద మల్ల య్య, కొమరగిరి కేశవరావు, సామ్రాజ్యం, కల్లెబోయిన సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘వలస కూలీల
సమస్యలపై ఆరా’
ఏటూరూనాగారం: ఛత్తీస్‌గఢ్ వలస కూలీల సమస్యలపై త్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మండవి ఆరా తీశారు. మండల పరిధిలోని శివాపూర్ గ్రామ సమీపంలో ఉంటున్న వలస కూలీలను ఎమ్మెల్యే విక్రమ్ మండవి ఆదివారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. కూలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, నాయకులు వినయ్, వంగపడ రవి, శివాపూర్ సర్పంచ్ సుగుణ, సంధ్య, సుధాకర్ రెడ్డి, సాగర్, మహేశ్ తదతరులు ఉన్నారు.
రావి ఆకుపై
కెప్టెన్ స్మిత్‌మచ్చర్ చిత్రం
ఏటూరూనాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు దేవరాయి రమేశ్ ఆదివారం రావి అకుపై ఇటీవల ప్‌లైదుబాయ్ విమానంలో సహ పైలెట్ దాడికి గురై తీవ్రంగా గాయపడి ధైర్యసాహసాలతో విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడిన స్మిత్ మచ్చర్ చిత్రాన్ని గీశాడు. విమానంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు లెక్క చేయకుండా వ్యవహరించిన ఆయన సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రకృతి ప్రసాధించిన ఆకుపై ఆయన చిత్రన్ని గీసినట్ల రమేశ్ తెలిపారు.
సింగరేణి ఆస్తులు ధ్వంసంచేస్తే ఊరుకోం
భూపాలపల్లి అర్బన్: రోడ్డు విస్తరణ పేరుతో సింగరేణి సంస్థకు చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బడితల సమ్మయ్య, అప్పాని శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీ వైపు వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చిరు వ్యాపారుల దుకాణాలతో పాటు సింగరేణి కమ్యూనిటీ హాల్, కార్మిక సంఘాల కార్యాలయాల ప్రహరీలను కూల్చే ప్రయత్నాన్ని కార్మికులు అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు, కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడేసే చర్యలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా సింగరేణి ఆస్తులను కూలేల్చేయడం సరికాదన్నారు. రోడ్డు విస్తరణ, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల వ్యవహారానికి తెరతీస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మున్సిపల్ పాలకవర్గంపై ఆరోపణలు చేశారు. సింగరేణి యాజమాన్యానికి సమాచారం ఇచ్చామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో సోమవారం కార్మిక సంఘాల జేఏసీ నాయకులంతా సీఎండీని కలిసి వివరించనున్నట్లు తెలిపారు. కూల్చివేసిన ఆస్తులను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు.


