ఏటూరునాగారం/వాజేడు: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను వెంటనే లారీల్లో మిల్లులకు తరలించాలని ఎస్పీ రాంనాథ్ కేకన్ నిర్వహకులకు సూచించారు. మండల కేంద్రంలోని జీసీసీ, తదితర కొనుగోలు కేంద్రాలను ఏఎస్పీ మనన్ భట్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ధాన్యం బస్తాలు ఇప్పటి వరకు ఎన్ని లోడ్లు పంపించారని జీసీసీ పాయింట్ ఇన్‌చార్జ్ సాంబరావును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 18 లోడ్లు తరలించామని ఇంకా 20 వరకు తరలించాల్సి ఉందని, లారీలు రాకపోవడంతో బస్తాలు వెళ్లడం లేదని వివరించారు. మొక్కజొన్న సరుకును తరలించడానికి వాజేడు వద్ద లారీలు ఎక్కువగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న లారీలను ఇక్కడికి తరలించి ముందుగా వరి ధాన్యం బస్తాలను తరలించాలని స్థానిక సీఐ శ్రీనివాస్‌ను ఎస్పీ ఆదేశించారు. అనంతరం వాజేడు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గిడ్డంగిలో మొక్కజొన్న నిల్వ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. మొక్కజొన్నను వేగంగా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా తరలించాలన్నారు. రవాణాకు లారీల కొరత ఉంటే అధికారుల సహకారం తీసుకోవాలని నిర్వహకులకు సూచించారు.
రహదారి పనుల పరిశీలన
వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో కొనసాగుతున్న రహదారి పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం పరిశీలించారు. ఈ మేరకు ఆయన మండల పరిధిలోని మురుమూరు నుంచి పామునూరు, జల్ల, డోలి మీదుగా తబపల వరకు కొనసాగుతున్న పనుల వివరాలపై ఆరా తీశారు. రహదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనన్‌భట్, డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రాంనాథ్ కేకన్


