మల్లూరుగుట్టపై మంటలు | - | Sakshi
Sakshi News home page

మల్లూరుగుట్టపై మంటలు

May 20 2026 2:04 AM | Updated on May 20 2026 2:04 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై మంటలను నివారించేందుకు సంబంధిత అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గుట్టపై తరచుగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో లక్షల రూపాయల విలువైన అటవి సంపద కాలి బూడిదవుతోంది.

అడవిలో కార్చిచ్చు

సుమారు 30 కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న మల్లూరు గుట్టలపై వందల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. గుట్టచుట్టూ ఉన్న అటవి ప్రాంతంలో మండు వేసవిలో సైతం తోగుల్లో ఊటనీరు, సహజసిద్ధమైన జలదారలు ఉండటంతో వివిధ రకాల అటవి జంతువులు, వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వేసవి కాలంలో కార్చిచ్చు, పోడు నరికే వారు అడవికి వచ్చి నిప్పు పెట్టడంతో అడవి తరచుగా దగ్ధమవుతోంది. దీంతో అడవి తగలబడటంతో పాటు కొన్ని వన్యప్రాణులు సైతం వేడికి తాళలేక సమీప గ్రామాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత అటవీశాఖ అధికారులు తమకేమీ సంబంధం లేదనే విధంగా వ్యవహరించడం గమనార్హం.

మూడు రోజులుగా..

గత మూడు రోజుల నుంచి మల్లూరులోని హేమాచల క్షేత్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు వెంట ఉన్న అటవి ప్రాంతం దగ్ధం అవుతోంది. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు మంటలను నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. ఇటీవల ఇదే ప్రాంతంలో రిజర్వు పారెస్టు చుట్టూ ఏర్పాటు చేసిన ట్రెంచ్‌ను పూడ్చి రోడ్డు పనులకు గుట్టను తవ్వి టిప్పర్లతో మొరం తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయా కాలనీ వాసులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పట్టించుకోని అధికారులు

దగ్ధమవుతున్న విలువైన అటవీ సంపద

Advertisement
 
Advertisement
Advertisement