ములుగు: వర్షాకాలంలో వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నేడు (సోమవారం) జిల్లాలో మాక్ ఎక్సర్‌సైజ్‌ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం కలెక్టరేట్‌లో మాక్ ఎక్సర్‌జైజ్ వివరాలను వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని, మాక్ ఎక్సర్‌సైజ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వరదలు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, అధికారుల సన్నద్ధతను పరీక్షించేందుకే నేడు ములుగు పట్టణంలోని వివేకానంద, కృష్ణ, పల్సాబ్‌పల్లి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎక్సర్‌సైజ్‌లో వరద ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఎవాక్యుయేషన్ చర్యలు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, పునరావాస కేంద్రాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సమన్వయంతో పనిచేసేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని వివరించారు.
నేటి ప్రజావాణి రద్దు
ములుగు: ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని తెలియజేప్పే మాక్ ఎక్సర్‌సైజ్‌ను జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇళ్ల గణన పరిశీలన
వాజేడు: మండల పరిధిలోని మొరుమూరు గ్రామ పంచాయతీలో చేపట్టిన ఇళ్ల గణన కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీకాంత్‌నాయుడు ఆదివారం పరిశీలించారు. ఇళ్ల గణన జరుగుతున్న తీరును ఎన్యుమరేటర్లను అడిగి తెలుసుకోవదంతో పాటు ఒక్క ఇళ్లు కూడా గణన నుంచి తప్పి పోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పలు సూచనలు చేశారు.
క్రీడా పాఠశాలకు ఎంపిక
కన్నాయిగూడెం: రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు మారుమూల ఆదివాసీ ముద్దుబిడ్డ ఎంపికయ్యింది. హకీమ్‌పేటలోని క్రీడా పాఠశాలలో అడ్మిషన్ల కోసం ఇటీవల పోటీలు నిర్వహించగా మండల పరిధిలోని రాజన్నపేట పంచాయతీ పరిధిలోని గంగగూడెం గ్రామానికి చెందిన పొడెం నందిత ప్రతిభ చూపి ఓపెన్ కేటగిరిలో ఎంపికయ్యింది. నందిత ఏటూరునాగారం మండల పరిధిలోని ఆకులవారి ఘనపురం ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. పోటీలో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపిక కావడంతో తల్లి,తండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గోదావరిలో
ప్రముఖులకు దారి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్‌లు రానున్నాయి. అక్కడే కంటెయినర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. బయోటయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షమియానాలు, మ్యాట్‌లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. అలాగే
సరస్వతీనది అంత్యపుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.


