● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు/ములుగు రూరల్: సమాజంలో విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, అక్షరజ్ఞానం మనిషిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ హాల్‌లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విద్య విజయోత్సవ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి మించిన మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందిస్తుందని తెలిపారు. విద్యారంగంలో జిల్లాకు ప్రత్యేకమైన విశిష్టత లభించిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల చూపు జిల్లా వైపే ఉందని వెల్లడించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. విద్యా రంగంలో జిల్లా సాధిస్తున్న పురోగతిని మంత్రి కొనియాడారు. ఫలితాల్లో బాలికలే ఎక్కువ సంఖ్యలో ఉండడం అభినందనీయమన్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్ ఫలితాలతో పాటు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు, ప్రశంస పత్రాలు, ఒక్కొక్కరికి రూ.10వేల నగదు అందించారు. పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు లాప్‌టాప్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహిన్, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వీరేందర్, డీసీఇబీ కార్యదర్శి సూర్యనారాయణ, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు శ్యామ్ సుందర్ రెడ్డి, రజిత, అడల్ట్ ఎడ్యుకేషన్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాల్, టాస్ ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ పీర్ల కృష్ణబాబు పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని మంత్రి సీతక్క అన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో యువతకు నిర్వహించిన వాలీబాల్ క్రీడల ఫైనల్ మ్యాచ్‌ను మంత్రి సీతక్క ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం త్వరలో విడుదల చేసే నోటిఫికేషన్‌కు ఉచిత శిక్షణ శిభిరాలను ఏర్పాటు చేసి జిల్లా నుంచి ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తామని వివరించారు. యువకులు వాహనాలు నడిపే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. అనంతరం గెలుపొందిన జట్లకు బహుమతులను అందించారు. మంత్రి సీతక్కను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మమన్ భట్ శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎస్పీలు కిశోర్ కుమార్, రవీందర్, సీఐ సురేశ్‌కుమార్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


