● లారీల కోసం రోడ్డెక్కిన రైతులు
● గంటన్నర పాటు నిలిచిపోయిన ట్రాఫిక్
మంగపేట : కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే మిల్లులుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని కమలాపురంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట గల ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై రైతులు గంటన్నర పాటు బైటాయించి ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పలువురకు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు పెట్టి మిల్లులకు తరలించేందుకు లారీలను రాకపోవడంతో 25 నుంచి 40 రోజులుగా బస్తాల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇంకా ఇదే పరిస్థితి కొనసాగితే పండించిన పంట అకాల వర్షాల పాలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు లారీల సమస్య తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో ధర్నాకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ జామ్
మండు టెండను సైతం లెక్క చేయకుండా గంటన్నర పాటు రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాలు భారీ స్థాయిలో నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ప్రయాణికులు, వాహనదారులు ధర్నా వద్దకు చేరుకుని మీ సమస్య కోసం తమను ఇబ్బంది పెట్టడం సరికాదని రైతులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. విషయాన్ని సంబంధిత జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.


